ఫీడులు:
టపాలు
వ్యాఖ్యలు

{కొంతమంది చేసే నేరాలకు టోకుగా మగజాతిని పేర్కొని నిందించడం నాటుగా అసహ్యంఉంది. అదే, ఆడవాళ్ళని నిందిస్తే sexism అంటారు. ఏం ? ఆ గౌరవానికి మగవాళ్ళు అర్హులు కారా ? ఆడముండలు అంటే ఎంత తప్పో మగమృగాలు అనడం అంతే తప్పు.

విషయం విశదంగా చెప్పడం కోసం గ్రామ్యం వాడాల్సి వచ్చింది. ఏమీ అనుకోవద్దు.}

ఓ రాత్రి క్రిక్కిరిసిన బస్సులో ఇంటికెళుతున్నా. దారి మధ్యలో ఓ నడి వయస్సు స్త్రీ బస్సెక్కింది. అప్పటికే బస్సు నిండి ఉండటం, ఊతంగా బస్సులో ఉండే కమ్మీని సైతం అందుకోలేనంత పొట్టిగా ఉండటంతో “స్త్రీలు” అని వ్రాసి ఉన్న సీట్లలో కూర్చుని ఉన్న ఓ యువకుడిని సీటివ్వమంటూ బ్రతిమాలుకుంది.

అప్పుడా యువకుడు ఏమన్నాడో తెలుసా..
మీరు (ఆడవారు) మాత్రం పురుషుల సీట్లలో కూర్చోగా లేనిది, మేము ఆడాళ్ల సీట్లలో కూర్చుంటే ఏం? మా సీట్లలో కూర్చున్నప్పుడు మిమ్మల్ని లేవమంటే లేస్తారా? మేము మాత్రం మనుష్యులం కాదా? అంటూ ఆవిడపై మండిపడ్డాడు.

కొన్ని కొన్ని విషయాల్లో కొందరికే ప్రాధాన్యం ఇవ్వబడుతుంది.
యత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవతాః అని కదా ఆర్యోక్తి. ఈ సృష్టిలో స్త్రీలకే పరిమితమైన కొన్ని శారీరక బలహీనతలు ఉన్నాయి, ఉంటాయి. ఇందులోనూ కొందరికి మినహాయింపు లభించవచ్చు. తక్కిన వాళ్లతో పోల్చితే, స్త్రీలను భారతీయులు బాగా గౌరవిస్తారని ప్రపంచ ప్రజల నమ్మకం. అలాంటి నమ్మకాలకు, విలువలకు తిలోదకాలిచ్చే ఇలాంటి వికృత చేష్టల మూలంగా యావద్భారతావని సభ్య సమాజం ముందు సిగ్గుతో తల వంచుకుంటోంది.

ఒక్క రాజకీయ నాయకుడు చేసిన తప్పుకు మొత్తం రాజకీయ వ్యవస్థను, లంచగొండియైన ఒక్క పోలీసు మూలంగా పోలీసు శాఖ మొత్తాన్ని మీరెప్పుడు విమర్శించలేదేమో నాకు తెలియదు. సగటు భారతీయునిగా, అందులోనూ ఆంధ్రునిగా మన రాష్ట్రంలో జరిగే ఇలాంటి అరాచకాలపై నేను గతంలోనూ స్పందించాను, ఇకపై కూడా స్పందిస్తాను.

ఇక మీరు ఉపయోగించిన గ్రామ్యం గురించి నేనేమీ బాధపడటం లేదు. సంస్కారంపై ఆధారపడి వ్యావహారిక భాష ఉంటుంది. మీకు మాత్రమే సాధ్యమయ్యే ‘సరళమైన’ భాషలో మీరు స్పందించినందుకు ధన్యవాదాలు. “ఆడముండలు” అనేటటువంటి పద ప్రయోగాన్ని నేనైతే ఉపయోగించలేను. ఎందుకంటే నాకు “అమ్మ” ఉంది.

మగ మృగాలు

మగ మృగాలు

మగ మృగాలు

 

ఇలాంటి దాడులు జరిగితేనే కదా -
మనబోంట్లకు (మీడియాకు) చేతి నిండా పని దొరికేది.
రాజకీయ నాయకుల మైకులు మరింత వేడెక్కేది.

ఇలాంటి దాడులు జరిగితేనే కదా -
చరిత్రను తవ్వుకునేందుకు అవకాశం దొరికేది.
మారిన ప్రభుత్వాల నడుమ దాడుల వ్యత్యాసాన్ని లెక్క కట్టేది.

ఇలాంటి దాడులు జరిగితేనే కదా -
సామాన్య జనం నుండి మేధావి వర్గం వరకు
కలాలకు, కులాలకు పట్టిన బూజు దులిపేది.

ఇలాంటి దాడులు జరిగితేనే కదా -
ఇలాంటి అభాగినులు ఉంటేనే కదా -
ఇలాంటి మగ మృగాలుంటేనే కదా -
ఆంధ్ర దేశాన్ని ఆంధ్ర దేశంగా గుర్తించేది!!

మరేమంటాం..
మరేమనగలం..
అంటే వింటారా?

(http://discussion.webdunia.com/Telugu చర్చావేదికకు స్పందన…)

శ్రీచరితం

శ్రీచరితం

“ఏంటి.. నిజమేనా” ఒక్క క్షణం ఏం వింటున్నానో కూడా అర్థం కాని అయోమయంలో పడిపోయాను..
“నిజమేరా” మా మావయ్య సమాధానంలో ఏమాత్రం తేడా లేదు.
ఈయనేనా.. వరకట్నాలకు, భ్రూణ హత్యలకు వ్యతిరేకంగా పోరాటం చేసింది. ఇతనేనా పైసా కట్నం అక్కర్లేదంటూ ఓ పేద యువతిని తన జీవితంలోకి ఆహ్వానించింది. ఇంత చేసిన ఈయనా ఈ రోజు ఇలాంటి పని చేసింది.
లోపలి నుండి మా అత్తమ్మ ఏడ్పులు ఇంకా వినిపిస్తూనే ఉన్నాయి.

నా దృష్టిలో ఎంతో ఉన్నతుడిగా ఉన్న మా మావయ్య ఒక్కసారిగా పురుగు కంటే హీనమైపోయాడు. మరొక్క క్షణం కూడా అక్కడ నిల్చోలేక, ఆయన వెనుక నుండి పిలుస్తున్నా పరుగులాంటి నడకతో నా గదికి వచ్చేసాను.

వరసకు మావయ్యే కానీ, మాది సోదర బంధాన్ని తలదన్నే ఆత్మీయ బంధం. మా మధ్య దాపరికాలు ఏమీ ఉండవు. వయస్సులో నాకంటే పెద్దవాడైనప్పటికీ, దాదాపు అన్నీ విషయాల్లోనూ నేను ఆయన సలహా తీసుకుంటూ ఉంటాను. అలాగే ఆయన కూడా. ఇద్దరం సాహిత్య ప్రియులమే. ఆయనకేమో చలం ఇష్టం. నాకు శ్రీశ్రీ అంటే అభిమానం. మా ఇద్దరి చర్చల్లో కుటుంబ విషయాల కంటే పుస్తకాలు, సాహితీ విలువల గురించిన ప్రస్తావనలే ఎక్కువ ఉంటాయి.

సహజంగానే మావయ్య అభ్యుదయవాది. చిన్నతనంలోనే ఊరి పెద్దలను ఎదిరించి సహపంక్తి భోజనాలను ప్రోత్సహించాడు. ఆ (అ)కారణంగా ఊరి నుంచి వెలి వేయబడ్డాడు. అందరికీ, అన్నింటికీ దూరమైనప్పటికీ తన అభిప్రాయాలను ఏ మాత్రం మార్చుకోని మా మావయ్యంటే చిన్నప్పటి నుంచి ఓ రకమైన భక్తితో కూడిన ఇష్టం నాకు.

అలాంటి మావయ్య ఈ రోజు మా అత్తమ్మకు అబార్షన్ చేయించాడంటే నేనే కాదు – మా మావయ్యతో పరిచయమున్న ఏ ఒక్కరూ నమ్మలేరు. కానీ, దురదృష్టవశాత్తూ అది నిజమే.

రకరకాల ఆలోచనలతోనే రెండ్రోజులు గడిచిపోయాయి. అసలు ఇలాంటి పనికి ఎందుకు పూనుకున్నాడో ఆయన్నే నేరుగా అ(క)డిగేద్దామని బయల్దేరేంతలో ఆయనే నా గదికి వచ్చాడు. అయితే ఎప్పటిలా చిరునవ్వుతో కాదు.

“అత్తమ్మ ఎలా ఉంది..” నా గొంతులో ఏదో లోపించినట్టు ఉంది.
“ఏరా.. నా గురించి అడగవా..” ఆయన గొంతులో నిష్టూరం ఇసుమంతైనా లేదు.
“నీకేంలే మావయ్యా. చెప్పేవి శ్రీరంగనీతులు అనే సామెతలాగా ….!” నా గొంతులో ఏదో అడ్డు పడింది. అక్కడితో ఆపేశాను.
“ఏరా.. ఆపేసావేం. పూర్తి చెయ్యరా. నువ్వు నన్ను అర్థం చేసుకోలేదు కదూ” ఆయన మాటలో ఇప్పటికీ అదే మార్దవం, నన్ను కదిలించేది అదే, కట్టిపడేసేది అదే.

ఏంటిది.. అప్పుడే చీకటి పడుతోందా. గదిలో అంతా మసక మసకగా ఉందేం..
ఓ.. కంట్లో పల్చటి నీటి పొర.
చటుక్కున గోడవైపు తిరిగాను.

“ఏరా.. నా మొహం చూడటం కూడా ఇష్టం లేదా..”
“ఎందుకిలా చేసావ్ మావయ్యా.. ఎందుకింతలా దిగజారిపోయావ్. ఆదర్శాలు, నీతులు ఊరి జనాలకేనా. అసలు అత్తయ్య మొహం ఎలా చూడగలుగుతున్నావ్ నువ్వు. ఎంతో కాలంగా పిల్లల కోసం ఎదురుచూసిందే.. నోచని నోము, ఎక్కని గుడి లేదే. తీరా ఆమె ఓ బిడ్డకు జన్మనివ్వబోతుంటే ఎందుకా బిడ్డను కడుపులోనే చంపేసావ్.. కేవలం ఆడపిల్లనేగా.. కట్నాలు, కానుకలు ఇచ్చుకోలేవనేగా.. ఏం.. మేమంతా చచ్చామనుకున్నావా?” ఆవేశం, ఏడుపు కలగలిపిన నా మాటలు నా గది గోడలకే విచిత్రంగా వినిపించాయేమో.
“అయిపోయిందా” ఏంటసలు నాకర్థం కాకుండా ఉంది ఆయన తీరు. అదే స్థిరత్వం, ఎక్కడా తొట్రుపాటు లేకుండా..

“రేయ్ మాధవా.. ఈ నిర్ణయం తీసుకోబోయే ముందు నేనెంత మథనపడ్డానో, నాలో నేను ఎంత నలిగిపోయానో నీకు తెలియదురా.. ”
“ఏమైతేనేంలే మావయ్యా. జరగవలసింది జరిగిపోయిందిగా”
“నీకు సమకాలీన సమస్యల పట్ల అవగాహనే లేదురా”
“ఏంటి.. యాసిడ్ దాడులా.. ఇంకేం మాట్లాడకు మావయ్యా.. ఇంత పిరికివాడివి అనుకోలేదు” మొదటిసారిగా ధిక్కార స్వరం.. తాడో పేడో తేల్చేసుకుందామనే కసి..
“మా నాన్న నా చిన్నతనంలో ఎప్పుడూ ఓ మాట అనేవాడ్రా..
మా అక్కకి, అదే మీ అమ్మకు పెళ్లి కాక ముందు నుంచి అదే వరస. ఆడ బిడ్డకు ఆ మూడు ముళ్ళు వేయించేసానంటే, నా బాధ్యత తీరిపోతుంది. ఇక మగపిల్లలా.. గోచి పెట్టుకు తిరిగినా అడిగే నాథుడు లేడు అనేవాడు. మంచి రోజులు, చెడు రోజులు లేవు. సమయం, సందర్భం లేవు. ఎప్పుడు పడితే అప్పుడు. ఆయన ఆర్థిక పరిస్థితే అందుకు కారణమేమో. పదే పదే మీ అమ్మ పెళ్ళి గురించి ఆలోచించేవాడు. ఎట్టకేలకు ఓ శుభ ముహూర్తంలో ఆ కాస్తా ఘనకార్యం జరిపించేసాడు. ఇక చూడాలి ఆయన ఆనందం. పట్టపగ్గాల్లేవనుకో..”

sree-charithamఇవన్నీ నాకు తెలిసిన విషయాలే.. ఎన్నోసార్లు ఈయన చెప్పగా విన్నవే. ఇప్పటి చర్చకు దానికి సంబంధం ఏంటో అర్థం కాకున్నా ఆయన వాక్ప్రవాహానికి అడ్డు రాదల్చుకోలేదు. మళ్ళీ ఆయనే కొనసాగించాడు..

“బాధ్యతలురా మాధవా.. ఆడబిడ్డ అంటేనే బాధ్యతలు, కష్టాలు, కన్నీళ్లు.. బిడ్డ పుట్టిన మరుక్షణం కలిగే ఆనందం దాన్ని ఓ అయ్య చేతిలో పెట్టేవరకేరా. దాన్ని తీరా అత్తారింటికి పంపాక చూడాలి పాట్లు. రేయ్.. అత్తగారింటికి వెళ్లిన కూతురు ఇంటి నుండి ఫోన్ వస్తే చాలు, ఎలాంటి వార్త వినాల్సి వస్తుందోనని హడలి చచ్చే తల్లిదండ్రులు నాకు తెలుసురా. ఉన్న ఆస్తులు హారతిగా చేసి, వాళ్ల గొంతెమ్మ కోర్కెలు తీర్చినా ఏదో ఒక నెపంతో బిడ్డను కష్టపెడితే ఏం చేయాల్రా. కాలు కింద పెడితే కందిపోతాయేమోనని భయపడే కన్నతండ్రి తన కూతుర్ని దారుణంగా హింసించే వియ్యంకులను, అల్లుళ్లను ఏం చేయలేక గేటు బయట నుండి నిస్సహాయంగా కన్నీరు కార్చే సంఘటనలు కోకొల్లలురా”

“ఏం.. అందరూ ఒకేలా ఉంటారా ఏం. నువ్వు, మా నాన్న పెళ్ళాలను తన్ని తగలేసిన వారి జాబితాల్లో లేరుగా.. చేసిన తప్పును కప్పి పుచ్చుకునే ప్రయత్నంలో పొంతనలేని మాటలు మాట్లాడుతున్నావ్ మావయ్యా..”

“కాస్తా నన్ను మాట్లాడనిస్తావా
తీవ్రవాదుల పుణ్యమా అని రోడ్డెక్కిన వాడు ఇంటికి వస్తాడో లేడో చెప్పలేని పరిస్థితి. గతంలో కేవలం ఇంజినీరింగ్, మెడికల్ కాలేజీలకే పరిమితమైన ర్యాగింగ్ భూతం కారణంగా కాలేజీకి వెళ్లిన బిడ్డ ఇంటికి వస్తాడో రాడో తెలియని దుస్థితి. రోడ్ల మీద ఈవ్ టీజింగ్‌ల పుణ్యమాని ముక్కుపచ్చలారని విద్యార్థినులు అమానుష దాడులకు బలి అవుతున్నారు. ఈ రోజుల్లో ఉద్యోగాలకే కాదురా, ప్రాణాలకు గ్యారంటీ లేదు. ఏదైనా అనుకోని పరిస్థితుల్లో నాకేమైనా జరిగితే, ఇప్పటికే అవిటిదైన మీ అత్తయ్య ఆడబిడ్డతో ఎలా వేగుతుందిరా.. దానికి తగిన భద్రతను ఎలా ఇస్తుంది.”

“ఎప్పుడో చస్తామనే భయంతో, ఇప్పుడే చచ్చిపోవాలనుకోవడం అవివేకం మావయ్యా. సహజంగా మరణించడం వేరే, బలవన్మరణం వేరే. రెండు పరస్పర భిన్నాభిప్రాయాలను నువ్వు ఒకే గాటిన కట్టేస్తున్నావ్. నువ్వు చనిపోయే పరిస్థితే వస్తే, అత్తయ్యను ఆదుకోవడానికి అయినవారం మేమంతా లేమా” ఆయన చెప్పేది కొంతవరకు నిజమనే అనిపిస్తూ ఉన్నా అంగీకరించలేని నైజం.

“ఎవర్ని ఎవర్రా కాపాడేది. నువ్వు బంధాల గురించి మాట్లాడుతున్నావ్.. నేను వాస్తవ పరిస్థితుల గురించి మాట్లాడుతున్నాను.. అలా అని నేను చేసిందే కరెక్ట్ అని నేను వాదించను. కానీ, ఆడబిడ్డను కని, స్కూల్ రోజుల నుండి కాలేజీ రోజుల వరకు, ఆపై పెళ్లయ్యి అత్తవారింటికి వెళ్లాక, కడుపులు, కాన్పులు అంటూ వేగేందుకు నా తాహతు సరిపోదురా”

“నువ్వు చెప్పే ఏ కారణాలతోనూ నేను ఏకీభవించలేకున్నాను మావయ్యా..” అన్యమనస్కంగానే సంభాషణకు ముగింపు చెప్పాలనుకున్నాను..
“సరే.. కొన్నాళ్లాగు.. నిజం నిలకడ మీద తెలుస్తుంది” నా గది నుండి మొదటిసారి తలవంచుకు వెళ్లిపోయాడు మావయ్య..

పగలంతా ఆహారం కోసం తిరిగి అలసిపోయిన పక్షులు గూళ్లకు చేరుకుంటున్నాయి..
నేను కూడా నడుము వాల్చాను..
ఐతే..
విశ్రాంతి కోసం కాదు..
నాలోని మరో నేనుతో మరింత విపులమైన సంవాదం కోసం..!

sree_charitham_nuvvu_maathram_endhuku

నీకసలు మతి ఉందా
ఎన్ని సార్లు చెప్పినా మారవా
అసలెవరు నువ్వు..
ఎందుకిలా ఎండనకా, వాననకా నా వెంట పడి విసిగిస్తావ్
నీకు నా గురించి తెలియదు

ఇదేంటి
ప్రేమా, ఆరాధనా
నేను తింటేనే తింటానంటావ్
నేను తాగితే తాగుతుంటావ్
అసలు నీ లోకంలో నేను తప్ప మరొకరు లేరా

ఆ..
నీ బలహీనత నాకు గుర్తుందిలే..

చీకటి అంటే చచ్చేంత భయం నీకు
అప్పుడప్పుడూ నిన్ను తప్పించుకోవాలంటే నేనదేగా చేసేది
కానీ, కాసింత వెలుతురుంటే చాలు
చటుక్కుమని ప్రత్యక్షమైపోతావ్

నా సుఖాల్లో వెంటే ఉన్నావు
నా కష్టాల్లోనూ తోడుగా ఉన్నావు
నేను చేసే పాపపుణ్యాల్లో నీకు భాగముందిగా
మరి నేనేమైనా పుణ్యం చేసానా అనేది ఎప్పటికీ శేష ప్రశ్నే

మరి..
ఎవరున్నారు ఇంతలా
నా వెంట నువ్వు తప్ప
రక్త సంబంధీకులా
స్నేహితులా
అధ్యాపకులా
అధికారులా

ఐనా..
నేను నిన్ను ఎప్పుడూ నిర్లక్ష్యం చేస్తూనే వచ్చాను
అసలు ఈ రోజేగా
నీతో మాట్లాడటం
నువ్వున్న దిక్కుకే నేను చూడనే
నీ ఉనికినే పట్టించుకోనే

నాకు ఇప్పటికీ అర్థం కాదు
నేను నీకేం ఉపకారం చేసాను
ఎందుకింత ప్రేమ నీకు
ప్రేమగా పెంచుకున్న కుక్కపిల్ల
తొలి ముద్దు రుచి చూపిన కన్నెపిల్ల
ఎవరూ లేరే నా వెంట

నీకు నా గురించి తెలియదు
నాతో ఉంటే నువ్వూ చచ్చిపోతావ్
ఇదిగో
ఇప్పుడో
ఇంకాసేపటికో

ఏదో తాగిన మత్తులో చెబుతున్నానుకోకు
ఏం
తాగితే చెప్పకూడదా
తాగడం నేరమా ఏం

డబ్బున్నోడు తాగితే కల్చర్
పేదోడు తాగితే వల్గర్
ఈ డబ్బు నిషా నాకు తెలియంది కాదులే
అన్నీ అనుభవించేగా చివరికి ఈ పరిస్థితి

ప్లీజ్
నువ్వయినా చెప్పిన మాట విను
వెళ్లిపో
ఏమి లేని నాకు
నాది అని చెప్పుకునేందుకు
నీడ” మాత్రం ఎందుకు

అందుకే
వెళ్లిపో

అసలు సమస్యే అది..

తెలిసీ తెలియని వయసులో మొదలైన మా స్నేహానికి ఇటీవలే పాతిక సంవత్సరాలు నిండాయి. ఎప్పుడు ఎవరి వైపు నుంచి మొదలైందో తెలియదు గానీ, ఏదైనా విషయానికి మాలో ఒకడు అవునంటే, ఖచ్చితంగా కాదనడం మరొకడికి అలవాటైపోయింది. ఎన్నో చర్చలు జరిగేవి.

ఉదాహరణకు – లక్షలు, కోట్లు ఖర్చు పెట్టి గుళ్లు, గోపురాలు ఎందుకు దండగ.. ఆ డబ్బుతో కొన్ని వేల కుటుంబాలు బాగుపడతాయి కదా అని నేనంటే ; ఈనాటికీ అంతో ఇంతో పాపభీతి ఉంది, అక్కడో ఎక్కడో కొందరైనా పాపాలకు ఒడిగట్టకుండా ఉన్నారంటే దానికి కారణం పాపభీతి అని, దానికి కారణం వీధివీధినా కనిపించే గుళ్లే అంటాడు వాడు. పొరపాటున క్యారెక్టర్లు మారినా, డైలాగులు మాత్రం మారవు. సారాంశం ఏమిటంటే – ఎడ్డెమంటే, తెడ్డెమనడమే. హద్దులు దాటి, ఆవేశాలకు లోనైంది కొన్నిసార్లే అయినా, తత్ఫలితంగా కొన్ని వారాలో, నెలలో మా మధ్య నిశ్శబ్దం రాజ్యమేలేది. మళ్లీ ఏ శుభ ముహూర్తంలోనో సయోధ్య కుదిరి, పాత విషయాలను తల్చుకుని నవ్వుకునేవాళ్లం.

ఈ సంవాదాల సంబరాల వలన కొండొకచో పరస్పరం మంచి విషయాలను తెలుసుకున్నాం కూడా.

ఇటీవలే మా మధ్య ఓ మంచి (?!?) అంశం చర్చకు వచ్చింది. అదేంటో కాదు – పోలీసులు, నక్సలైట్లు. (వాడు గానీ ఈ బ్లాగు చదివాడంటే, ముందు పోలీసుల పేర్లు ఎందుకు ఉంచావు, ఏం నక్సలైట్ల పేర్లు ఉంచవచ్చుగా అంటూ మరో కొత్త యుద్ధానికి బాకా ఊదేస్తాడు)

“పోలీసులకు తగిన శాస్తే జరిగింది బావా” అంటూ ఓ చల్లని సాయంకాలం నా రూమ్‌కు విచ్చేశాడు. “ఆహా, ఏంటో” అన్నా నేను ఎక్కసెక్కంగా. “టీవీలో ఇరవై నాలుగ్గంటలూ ఎఫ్ టీవి చూస్తుంటే సరిపోదురా.. అప్పుడప్పుడూ న్యూస్ ఛానెళ్లు కూడా చూస్తుండాలి” అంటూ చురక. “తమరికి తెలిసిందేమిటో సెలవియ్యండి సార్” ఓ అవకాశమిచ్చేసా వాడికి.

డైరెక్ట్‌గా రంగంలోకి దిగిపోయాడిక..

“వెన్నుపోటు పొడిచేందుకు కోవర్టులు, మెరుపుదాడి చేసేందుకు గ్రేహౌండ్స్ దళాలు, అత్యాధునిక ఆయుధాలతో అరణ్యాల్లో ఆదమరిచిన వారిపై దాడులు చేస్తూ బూటకపు ఎన్‌కౌంటర్లతో మీసాలు మెలితిప్పుకునే పోలీసులపై అనూహ్య దాడి చేసిన నక్సలైట్లు”.. నాటకీయంగా ప్రారంభించి, “నా అంచనా ఏమిటంటే – కనీసం ఓ 50, 60 మంది లేచిపోయుంటారబ్బాయ్” అంటూ ముగించాడు.

“ఏంట్రా, పోలీసులు మాత్రం మనుష్యులు కాదా, వాళ్లకు పెళ్లాం, పిల్లలు, కుటుంబాలు, వారిపై ఆధారపడినవారు ఉండరా ఏంటి? అంత ఆనందం ఏంట్రా శాడిస్ట్ వెధవా” మానవత్వం అనే అస్త్రంతో మొదటి దెబ్బ కొట్టాను. (అనుకున్నా)

“మరే.. నక్సలైట్లు మనుష్యులు కాదూ? వాళ్లను కాలిస్తే రక్తం రాకుండా సాంబార్, చట్నీ కారుతాయా” కామెడీ టచ్‌తో పాటు “వాళ్లపై ఆధారపడిన వాళ్లూ ఉంటారు, వాడికీ పెళ్లాం బిడ్డలు ఉంటారు.” అంటూ తిప్పికొట్టాడు.

“అవున్రా.. ఆళ్లకీ కుటుంబాలు ఉంటాయి. వాళ్లను కన్నపేగులు ఉంటాయి. కానీ – వాళ్ల గురించి ఆ నక్సలైట్ బిడ్డ అడవుల బాట పట్టకముందే ఆలోచించాలి. తుపాకీ’గొట్టం’తో దేశాన్ని బాగుపర్చలేరు. ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికల్లో పాల్గొనండి అంటూ తాత ముత్తాతల సీజన్ నుంచి మన నాయకులు ఏడుస్తూనే ఉన్నారుగా.. అంత చేవ ఉంటే, తమది అంత నిఖార్సయిన పంథా అనుకుంటే, పోరాట బాటను వీడి మన నేపాల్ మావోయిస్టుల్లా తెర ముందుకు రమ్మను.. అధికార పీఠాన్ని అధిరోహించి స్వయంగా ప్రజల కష్టాలను కడతేర్చమనవోయ్” శ్లేషతో కూడిన సవాల్ విసిరా.

“స్వంత కుటుంబం, స్వంత బ్రతుకు అంటూ స్వార్థానికి పోకుండా ఏ వెయ్యికో, లక్షమందికో ఒక్కడంటే ఒక్కడు సమాజంలోని చీడను రూపుమాపేందుకు తాను నమ్మిన సిద్ధాంతాల కోసం ఉద్యమ బాట పట్టే క్రమంలో కన్నవాళ్లను, తోడబుట్టినవాళ్లను విస్మరిస్తే అది మహాపాపం కాబోలు.. ఆ బిడ్డ కోసం కన్నవారు బాధపడటంలో అర్థం లేదంటావ్?” సూటిగా ప్రశ్నించాడు.

sree-charitham_asalu-samasya

“నిజమేరా.. ‘దారి తప్పిపోయిన’ బిడ్డ కోసం కన్నవాళ్లు బాధపడతారు. కానీ – అనుక్షణం భయం నీడలో బ్రతుకుతూ, బ్రతికాడో, చచ్చాడో తెలియని బిడ్డ కోసం ఆ తల్లి ఆలోచించే విధానానికి.. అదే సమయంలో, పోలీసు విధులను నిర్వర్తిస్తూ, సమాజంలో ఓ ఉన్నత స్థానంలో ఉంటూ ఉదయాన డ్యూటీకి వెళ్లిన బిడ్డ సాయంకాలానికి శవమై ఇంటికి వస్తే ఆ తల్లి గుండె మరోలా స్పందిస్తుంది” అంతే సూటిగా చెప్పాను.

“నువ్వెన్ని చెప్పు.. నక్సలైట్లు తినే అన్నంలో విషం కలిపి చంపిన పోలీసులు, అరణ్యాల్లో ప్రవహించే వాగుల్లోని నీళ్లలో కేవలం నక్సలైట్ల కోసం విషం కలిపిన పోలీసులు, ఆత్మ రక్షణార్థం నక్లలైట్లపై పోలీసుల కాల్పుల పేరుతో బూటకపు ఎన్‌కౌంటర్లు.. అంటూ రోజూ పత్రికల్లో, టీవీల్లో వార్తలను చూడటం లేదా తమరు?” ఆవేశంతోనో, ఆవేదనతోనో వాడి మొహం ఎర్రబారింది.

కాసేపు నిశ్శబ్దం..
మళ్లీ వాడే కొనసాగించాడు..

“ప్రాణం పోయలేని మనిషికి ప్రాణం తీసే హక్కు లేదంటూ మహా మహా న్యాయస్థానాలే ఉరిశిక్షలను రద్దు చేస్తున్నాయి. ఎంత పాపాత్ములకైనా, ఘోరమైన నేరాలకు పాల్పడినవారికైనా బ్రతికేందుకు, వారి ప్రవర్తనలో పరివర్తనను తెచ్చుకునేందుకు ఓ అవకాశాన్ని ఇస్తున్నాయి. మరి మధ్యలో ఈ పోలీసులకేం పోయే కాలంరా.” ఊపిరి పీల్చుకునేందుకో, ఆలోచించుకో రా అన్నట్లో కాసేపు మళ్లీ నిశ్శబ్దం.

“ప్రాణాలు తీయడం తప్పే. మరి ఈ దాడులతో పోలీసుల ప్రాణాలు తీసే నక్సలైట్లు గొప్పవాళ్లా… కాలుకు కాలు, కన్నుకు కన్ను అనే అరణ్య నీతినే నమ్ముకుంటే ఇక మనిషికి, జంతువుకు తేడా ఏముందంటావ్” అన్నాను.

“వాళ్లకు వీళ్లకు ఏం తేడా లేదు? గదిలో కట్టేసి కొడితే పిల్లి అయినా తిరగబడుతుందని నీకు తెలియదా. ప్రాణాలు తీసేందుకు సిద్ధపడిన వాడి ముందు కూర్చుని న్యాయసూత్రాలు వల్లిస్తే ఫలితముంటుందా? తమను తాము రక్షించుకునే క్రమంలో, తమపై దాడి చేసేందుకు వచ్చే వారిని అంతమొందించడంలో రాజనీతి ఉంది. ఏ యుద్ధంలోనైనా మనం గెలవడం ఒకటైతే, అవతలివాడిని ఓడించడం మరొక పద్ధతి. నువ్వూ చదరంగం పులివేగా. నీకా మాత్రం తెలీదా” అన్నాడు.

“అయితే, నీ దృష్టిలో పోలీసులను లేపేస్తున్న నక్సలైట్లు హీరోలన్నమాట” నా గొంతులో మార్పు నాకే విచిత్రంగా ధ్వనించింది.
“మరి నీకు – నక్సలైట్లను అన్యాయంగా చంపేస్తున్న పోలీసులే హీరోలన్నమాట” వాడి గొంతూ గంభీరంగానే విన్పించింది.

“నువ్వన్నట్లు తాము నమ్ముకున్న సిద్ధాంతాల కోసం తమ యవ్వనాన్ని, భవిష్యత్తును, కుటుంబాన్ని వీడి పోరుబాట పట్టినోళ్లు కొందరు. తమను తాము మావోయిస్టులనో, నక్సలైట్లనో పరిచయం చేసుకుంటారు. మరొక వైపు – సమాజంలో జరుగుతున్న అన్యాయాలు, అక్రమాల్లో కొన్నింటినైనా అరికట్టే సదుద్దేశ్యంతో కొందరు ఖాకీ దుస్తులు ధరించి పోలీసులు అవుతారు. పదుగురాడు మాట పాడియై ధఱ చెల్లు అనే సామెత నీకు తెలీదా. ఈ రాష్ట్రంలో, కాదు దేశంలోనైనా ప్రపంచంలోనైనా మీ మావో’ఇష్టు’లు ఎందరున్నారు. పోలీసులు ఎందరున్నారు. నువ్వు చెప్పే ఆ పోరుబాటే ఉన్నతమైనదైతే, అందరూ దాని పట్ల ఆకర్షితులై ఉండాలిగా.” కాస్తా గ్యాప్ ఇచ్చాను..

“మంచి చేసే వేప చేదును ఎవరూ ముట్టుకోరు.. వ్యాధులను తెచ్చిపెట్టే పంచదారకే ఆకర్షితులవుతారు.” సింపుల్‌గా తేల్చేశాడు.

“ఇక్కడ ఆ సిద్ధాంతం పనిచేయదోయ్. నా కొడుకు నక్సలైట్ కావాలి, సమాజాన్ని బాగు చేయాలి అని ఏ తల్లి అనుకోదు. కానీ, నా కొడుకు ఓ పోలీసాఫీసర్ కావాలి అని అనుకునే తల్లి ఉంటుంది. తల్లి మనసు గురించి, తల్లి ప్రేమ గురించి ఏకైక కుమార రత్నానివి నీకు తెలియదా” సెంటిమెంట్ కోటింగ్ ఇచ్చా.

“కానీ అలా కోరుకునే ప్రేమలో స్వార్థం ఉంటుంది. పోలీసైతే సంఘంలో ఓ గుర్తింపు, హోదా వస్తాయి. నక్సలైట్ అయితే అనుక్షణం భయపడుతూ బ్రతకాలి. ఇక్కడ తల్లయినా, తండ్రైనా తమ స్వప్రయోజనాల కోసమే కొన్ని సాంఘిక ప్రయోజనాలను తనఖా పెడుతుంటారు.” నిక్కచ్చిగా అనేసాడు..

మా పోట్లాటలో పడి పట్టించుకోలేదు. ఎప్పుడొచ్చాడో కానీ, ఆ మూల కిటికీలో కూర్చుని ఎంతో శ్రద్ధగా మా వాదనంతా వింటున్నాడు సంజయ్.

వాడి వైపు చూసిన చూపులోనే సహాయం చేయరా బాబూ అంటూ ఓ అభ్యర్థన పారేశా.. మా వాడు అందుకున్నాడు..

“అసలు నక్సలైట్లు ఏయే విషయాల్లో గొప్పవాళ్లంటావ్” కుమార్‌పై మొదటి బాణం విసిరాడు.
నాకు కాస్తా పట్టు దొరికింది.
“నైతిక విలువలు పాటించడం నుంచి అన్ని విషయాల్లోనూ” దృఢంగా చెప్పాడు.
“పోలీసులు నైతిక విలువలకు తిలోదకాలిచ్చేశారని అంటావ్” మా సంజయ్ గొంతులో ఈసారి వ్యంగ్యం ధ్వనించింది.
“మరి.. కానిస్టేబుల్ నుంచి ఐ.జి. దాకా ఎన్ని అక్రమాలకు పాల్పడటం లేదు? వీళ్ల అండతో వీళ్ల పెళ్లాలూ, పిల్లలూ అదే హోదాను, దర్పాన్ని ప్రదర్శిస్తుంటారు” కుమార్ గొంతులో విసురు.
“మచ్చుకు నాకొకటి చెప్పొచ్చుగా” వీడే మాత్రం తగ్గలేదు.
“ఎస్.ఐ. పెళ్లానికి కానిస్టేబుల్ పెళ్లాం అంటే లోకువ. సి.ఐ. పెళ్లానికి ఎస్.ఐ. పెళ్లాం లోకువ.”
మధ్యలోనే కట్ చేసాడు సంజయ్ – “మధ్యలో ఈ పెళ్లాల గొడవేంటి బాస్…”
“అక్కడికే వస్తున్నా.. వీళ్లిచ్చే చనువుతోనే వాళ్ల పెళ్లాలూ అధికారాన్ని ప్రదర్శిస్తుంటారు. ప్రభుత్వ సొమ్ముతో నడిపే జీపుల్లో దర్జా ఒలకబోస్తూ సినిమాలకు పోతుంటారు. గుళ్లలో ప్రత్యేక దర్శనాలు, షాపింగ్ మాల్‌లలో ఊహించని డిస్కౌంట్లు… ఆవిడ మొగుడిగారికి భయపడి అందరూ ఆమెకు సలాములు చేస్తుంటారు. ఇక అడ్డేముంటుంది.”

మా టాపిక్ పూర్తిగా పక్కదారి పట్టిందనే నేననుకున్నా..

“వీడి పెళ్లాన్ని వాడు చేస్కుంటాడు. దాని మొగుడిని ఇది లేపుకుపోతుంది.. అసలు వీళ్లకేం విలువలున్నాయి.” అలాగే ముందుకెళ్లిపోతున్నాడు వాడు..

“ఆగాగు బ్రదర్.. అసలీ విషయాలన్నీ నీకెలా తెలుసు”..

“ఏం.. మీరు పేపర్లు చూడరా. సందుకో నిర్వాకం జరుగుతోంది. బీటు కానిస్టేబుల్ నుంచీ డి.ఎస్పీ, డి.ఐ.జిల వరకు ఇదే తంతు.”

“పేపరోళ్లకు వీళ్ల సంగతి ఎలా తెలుస్తుంది”..

“వీళ్ల బయోడేటాలు, ప్రొఫైళ్లు సంపాదించడం అంత కష్టమేం కాదు.. ఎవరినడిగినా వీళ్ల దుర్మార్గాలను పూసగుచ్చినట్టు చెబుతారు.”

“అదే మరి.. కాస్తా ఆగు.. వీళ్లందరూ ఈ సంఘంలో – పెద్ద పెద్ద పదాలు ఎందుకు గానీ.. నీ పక్క ఇళ్లల్లో, మీ పక్క కాలనీల్లో బ్రతికేస్తుంటారు. వీడు పోలీసు, ఈమె పోలీసుగారి మిసెస్.. వీడు తప్పు చేసింది, ఆమె అలా కులికింది అంటూ ఎప్పటికప్పుడు అందరికీ తెలుస్తుంటాయి. మరి అడవుల బాట పట్టినవారు చేసే పనులు నీకు నాకూ ఎలా తెలుస్తాయి చెప్పు. కొన్ని సంవత్సరాలకు, ఈ మధ్య గానీ గణపతి అనే పెద్దాయన ముఖం ఎలా ఉంటుందో పోలీసులకు, ప్రజలకు తెలియదు.. ఆ దొరికిన ఫోటో కూడా ఏ కాలానిదో ఏంటో.. ఇక వాళ్ల కుటుంబాలు, పెళ్లాలు సంగతి నీకు ఎలా తెలుస్తుంది.

నక్సలైట్లలోనూ పెళ్లీడుకొచ్చిన పిల్లలతో సహా మొగుడిని వదిలేసి సరిక్రొత్త రాగాలందుకునే పాతకులున్నారు.

చూడు బ్రదర్.. మీడియా గురించి నీకు ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. అయినా బటన్ కెమెరాలు పట్టుకుని ఎప్పుడు ఏ సంచలనం దొరుకుతుందా అని, దొరక్కపోతే మనమే సృష్టించేస్తే పోలా అనుకునే బాపతు వాళ్లు ఇప్పుడు బాగా పెరిగిపోయారు. వీళ్లు రిస్క్ తీసుకోరు. అడ్డంగా దొరికిపోయే ఏ బకరాగాడి న్యూసో ఇరవై నాలుగ్గంటలూ తిప్పించి, మళ్లించి ప్రసారం చేసేస్తుంటారు. అవునా, కాదా..” సంజయ్ వాగ్ధాటికి కుమార్ నుంచి స్పందనే లేదు.

కుమార్ గాడు మౌనం దాల్చాడు.

“నక్సలైట్లకు, పోలీసులకు కొన్ని తేడాలున్నాయి బాస్.. అవి – మంచి లక్ష్యం కోసం అడ్డదారిలో పోయేవాళ్లు నక్సలైట్లు. ఏదో లక్ష్యంతో సర్వీసులోకొచ్చి ఏమి చేయలేక, రాజకీయాలకు బలయ్యేవాళ్లు పోలీసులు… రాజకీయ చదరంగంలో ఈ ఇద్దరూ బలిపశువులే.”

“అయినా కుమార్, నాకు తెలీకడుగుతాను – మీ ఇద్దరిలో ఏ ఒక్కరూ పోలీసు కాదు, నక్సలైటూ కాదు.. కానీ నువ్వన్నట్లు పోలీసుల గురించి ఎలాగైనా తెలుస్తుంది. అడవుల్లో బ్రతికే మాబోటిగాళ్ల గురించి నీకెలా తెలుస్తుంది ?!”

ఆకాశంలో సూరీడు అలసిపోయాడు..
గదిలో మేమూ అలసిపోయాం..
సంజయ్ చెప్పినదాంతో పూర్తిగా కాకున్నా, కొంతవరకు శాంతించినట్లు మా కుమార్ ఆలోచనల్లో మునిగిపోయాడు..
మా ఇద్దరినీ మళ్లీ ఏకాంతంలోకి నెట్టేస్తూ, మా సంజయ్ అలియాస్ సూర్యం చీకట్లో మాయమైపోయాడు.

పండగంతా మా ఇంట్లోనే ఉందా అన్నట్లుగా ఉందా వాతావరణం..
సందడే సందడి..
ఏ రోజైనా ఫ్యాంటు, షర్టు అదీ కాకుంటే ఏ ఫ్రాక్‌లోనో ఆధునికంగా కన్పించే మా బుడిగమ్మ కూడా ఫక్తు సంప్రదాయ దుస్తుల్లో కన్పించేస్తూ ఉంది కళ్లెదుట..
డివిడి ప్లేయర్‌లో మా అన్నగారి అభిరుచికి తగ్గట్లు ఘంటసాలగారి భక్తి పాటలు..
అంతా బాగానే ఉందే అనుకునేలోపు మా అక్కగారి కేకలు..
ఏమైందో ఏంటో అని లోనికి పరిగెట్టేలోపు..
ఆ కేకలకు మూలకారణమైన మేనల్లుడు బబ్లూగారు, వాడి వెనకాలే అక్కగారు నా దగ్గరికే పరిగెత్తుకుంటూ వచ్చేసారు..
బబ్లూగాడు కన్పించేంతటి మంచోడేం కాదు..
నా పోలికే అంటుంటుంది మా అమ్మ..
ఒకటే గొడవ..
నాకు ప్రీపెయిడ్ వద్దంటే వద్దు.. పోస్ట్ పెయిడ్ కావాలంటూ ఏడ్చేస్తున్నాడు వీడు.
కాదు కూడదు.. వాతావరణం బాగోలేదు.. ఇక నుంచి నీకు ప్రీపెయిడే దిక్కు అంటుంది మా అక్క..
నాకేం అర్థం కాలా..
పట్టుమని పదేళ్లయినా లేని వీడు – పోస్ట్ పెయిడ్ కావాలంటాడు.
ఈవిడేమో ప్రీపెయిడ్ అయితే ఓకే అంటోంది..
మా బావగారేమో నిమ్మకు నీరెత్తినట్లు పేపర్‌లో దూర్చిన తల బయట తీయడం లేదు…
మా అమ్మ తన మనవడు చేస్తున్న అల్లరిని తన్మయత్వంతో చూస్తోంది.

అసలేం జరుగుతోంది ఇక్కడ
నాకంతా తెలియాలి అంటూ గర్జించాను..

వీడికేమో పోస్ట్ పెయిడా..
వాళ్లమ్మ ప్రీపెయిడ్ తీసుకోమంటుందా..
అసలెన్ని మొబైళ్లు వాడుతున్నారు ఇంట్లో..
లెక్కా పక్కా లేకుండా పోతోంది..
ఎంత ఖర్చు, ఎంత వృథా..
అంటూ చిన్నపాటి లెక్చరిచ్చేసాను (అది మనకు వెన్నతో పెట్టిన విద్య)

అంతా సైలెన్స్..
పర్లేదు.. మనక్కూడా ఇంట్లో భయపడుతున్నారు అని లోలోన సంతోషించేలోపు..
పూజ గదిలోనుంచి బయటకు వచ్చిన అన్న, అమ్మ, అక్క, బావ, చివరికి మా బుడిగి, బబ్లూ అందరూ పడీ పడీ నవ్వులు..

నా అవస్థ చూసి జాలిపడిన మా అన్న ఆ పొడుపు కథ కాస్తా విడమర్చి చెప్పాడు..
గీతలో కృష్ణుడిలా..

నాయనా మాధవా..
పోస్ట్ పెయిడ్ అనగా చన్నీటి స్నానం.. ప్రీపెయిడ్ అనగా వేడినీటి స్నానం.. – అని…

ఇదేం పోలిక అని నేనడిగేలోపు మా బబ్లూగాడు అందుకున్నాడు..
వేడినీళ్లు అయితే లిమిటెడ్ మామయ్యా.. బకెట్‌లో ఎన్ని ఉంటే అన్నే పోసుకోవాలి.. అదే చన్నీళ్లనుకో.. మనిష్టం.. ఎన్నయినా పోసుకోవచ్చు.. అందుకే చన్నీటిని పోస్ట్ పెయిడ్ అని, వేణ్ణీళ్లను ప్రీపెయిడ్ అని అంటుంటా అనేసి తుర్రుమని బాత్రూమ్‌లో దూరి తలుపేసుకున్నాడు..

నా మొహంలో ఇంకా ప్రశ్నార్థకమే…

ఓ అమ్మ కథ

కన్ను నీదని, వేలు నీదని పొడుచుకుంటే రాదా రక్తం
రక్తమెంతగా ధారపోసినా దొరుకుతుందా మళ్లీ హృదయం
మనసులేని బ్రతుకొక నరకం
మరువలేని మనసొక నరకం

పై పాటను ఎవరు పడితే వారు, సందర్భంతో సంబంధం లేకుండా ఆయా పరిస్థితులకు తగ్గట్లుగా తమకు అన్వయించేసుకోవచ్చు.

మనసుకవి కలం నుంచి జారిన ఆణిముత్యాల్లో ఇదీ ఒకటి.

నా వరకు నేను, మొదటి వరుస మాత్రం ఇద్దరు అంతకంటే ఎక్కువ మంది పిల్లలు ఉన్న ఏ అమ్మకైనా సరిపోతుందనుకుంటున్నాను. అన్నదమ్ములుగా పట్టుమని ఐదేళ్ల వయసైనా లేని స్థాయి నుంచే మొదలయ్యే ఓ విచిత్రమైన పరిస్థితి కొన్ని సందర్భాల్లో హద్దులు దాటిపోతుంది. ఆజన్మ శత్రువుల్లా తలపడేవరకు తరుముతుంది. చివరికి వేరు కుంపట్లు, ఏవైనా కార్యాల్లో ఒకరికొకరు ఎదురైనా ఎడముఖం పెడముఖంగా ఉంటూ నలుగురిలోనూ చులకనైపోతుంటారు.

sreecharitham_o-amma-katha_smallనాకు తెలిసిన ఓ ఇద్దరు అన్నదమ్ములున్నారు. ఇద్దరికీ ఒకరంటే ఒకరికి ప్రేమే. ఆ ప్రేమ స్థాయి ఎంతటిదో, ఏపాటిదో వివరించలేను గానీ, ఒకరిపై ఒకరికి ద్వేషం మాత్రం లేదని ఖచ్చితంగా చెప్పగలను. కాకుంటే ఒకరికంటే ఒకరు ఏమాత్రం తీసిపోలేని రీతిలో కొంచెం మూర్ఖత్వంతో కూడుకున్న కోపం. అన్న వయస్సు అనుభవాల్లో పెద్ద కాబట్టి తన పంతమే నెరవేరాలంటూ పట్టుబడతాడు. మరి చిన్నవాళ్ల సంఘానికి అధ్యక్షుడినని ఫీలైపోయే చిన్నవాడు తక్కువ తిన్నాడా ఏంటి? చిన్నతనంలో వాళ్ల నాన్నగారు చెప్పిన ఓ మాటను గుర్తు చేస్తాడు. అది నాకూ ఎన్నోసార్లు చెప్పి ఉన్నాడు.  “మంచి చెప్పేందుకు చిన్న, పెద్ద, ఆడ, మగ తేడా లేదు. ఎవరైనా తమ అభిప్రాయాలను చెప్పవచ్చు”. ఇలా కొంచెం సెంటిమెంటు రంగులనద్దుతూ తన అన్నగారికి అసలు తెలివితేటలే లేవంటూ తేల్చి పారేస్తాడు. అన్నదమ్ముల మధ్య, ఆ మాటకొస్తే ఏ ఇద్దరి మధ్య ఉండాల్సింది భయభక్తులు కావని, స్నేహమేనంటూ పట్టుబడుతాడు.sreecharitham_o-amma-katha_big

ఇక ఆపై మాటకు మాట, దెబ్బకు దెబ్బ తోడై ఇల్లు కురుక్షేత్రాన్ని తలపిస్తుంది.

ఆ మహా సంగ్రామం మధ్యలో ఆ అమ్మ పడే కష్టముంది చూశారూ.. అబ్బో.. పగవాడికి కూడా అంత కష్టం వద్దు అనిపిస్తుంది. కరవమంటే కప్పకు కోపం, విడవమంటే పాముకు కోపం. పిల్లల మీద కోపంతో ఉపవాస వ్రతం చేపట్టి తనను తాను శిక్షించుకుంటుంది. రెండు కళ్ల వంటి ఇద్దరు పిల్లలు నువ్వా నేనా అంటూ పోటీపడుతూ, రెచ్చిపోయిన రేచుకుక్కల్లా కాట్లాడుకుంటుంటే తనలో తాను మౌనంగా రోదిస్తూ కూర్చుంటే సరిపోదుగా. ఈ నా కొడుకుల్లో మార్పు తీసుకురా దేవుడా అంటూ కనపడిన రాయికల్లా చేతులు జోడించడమంటే గాలిలో దీపం పెట్టి నువ్వే దిక్కు దేవుడా అన్నట్లే. ఒకరు లేని సందర్భాల్లో మరొకరిని దగ్గరకు తీసుకుంటుంది. వాడి కోసం అన్న ఎలా తాపత్రయపడేది నూరిపోస్తుంది. వాడు వచ్చే వరకు వీడు భోజనం చేయకుండా ఎదురుచూసిన రాత్రులను కళ్లకు కట్టినట్లు వర్ణిస్తుంది. ఐకమత్యం గురించి, ఇద్దరూ కలిసి ఉంటే కలిగే లాభాలను గురించి విడమరిచి చెబుతుంది. నువ్వు తెలివైనవాడివేనంటూ వాడి అహాన్ని తృప్తిపరుస్తూ, నేనెన్నో రోజులు బతకను సుమా అంటూ బెదిరిస్తూ, నీ సోదరుడిని కూడా నువ్వే కనిపెట్టుకోవాలి అంటూ బాధ్యతలను అప్పచెబుతుంది.

ఆ ఇద్దరూ కూడా ఆమె చివరి మాటలకు పడిపోతారు. బుద్ధిగా నడుచుకుంటామంటూ ప్రమాణాలు చేసేస్తారు. ఇకపై చూడు మా అన్నదమ్ముల ఐకమత్యం గురించి అంటూ డబ్బాలు వాయిస్తారు. ఆ రాత్రికి కొడుకుల కబుర్లతో కడుపు నిండిపోయిన ఆ తల్లి భోజనమే చేయదు. వారం, పదిరోజులు ఆ ఇంట్లో ఆనందం వెల్లివిరుస్తుంది.

ఆ అన్నగారికో, ఈ తమ్ముడుగారికో మళ్లీ పూనకం వచ్చేవరకు!

sreecharitham_maa-vuri-peddhayna

మడిసన్నాక ప్రతి ఓడికీ ఎప్పుడో అప్పుడు శ్మశాన వైరేగం వచ్చే ఉంటది. ఆ మూన్నాలుగ్రోజులూ తెగ ఇదైపోతాడు. అమ్మ లేదు, ఆలి లేదు. ఏవీ వద్దంటాడు. నాకెవరూ లేరు తో మొదలై, నేనెవరు వరకు లింకులెట్టేసుకుంటూ ఆలోసనల్లో తనకలాడతాడు.తిప్పి తిప్పి సూస్తే, ఆ ముచ్చట సరిగా మూడ్రోజుల్లో మూల కూచుంటాది.

అప్పుడెతుక్కునేస్తారు, ఓరోరు మనకు బాకీలున్నారు, ఓరోరు మనకు ఏమౌతారు ఇలాంటియ్యన్నీ.. ఆ మద్దెనెప్పుడో భూమిని ముంచేసే మహా పెలయం వచ్చేస్తాందంటే మా ఊరోళ్లంతా అయినకాడికీ కయ్య, కాలవ అమ్మేసుకున బలే జల్సా చేసేసుకున్నారులే. అప్పుడేమో బూమిని కొనేవాడిని జూసి అందరా – ఏందొరే, పిచ్చేవైనానా నీకా – అంటా తెగ ఎక్కసెక్కాలాడేసుండా. మరి ఆళ్లే ఇప్పుడు లచ్చలు లచ్చలు కూడబెట్టేసి, దర్జాగా కార్లో తిరిగేస్తుండారు. ఆళ్లని జూసి ఈళ్లు వలవలా ఏడస్తండారు.

అందుకే గందా – ఈ మద్దొచ్చిన ఆ పొడవాటి ఈరో – అదేనబ్బా అవితాబో, అకితాబో సినిమాలో మాబాగ చెప్పినాల్లే

కంటి ముందుగాలె కనబడె లాబాన్ని జూసేసి సంకలు గుద్దేసుకుంటే సరిపోదంట, ఆ యెనకాల యెంబడే వచ్చే నష్టాన్నో, కష్టాన్నో కూడా చూడాలంట!

సరే ఐతే – మా ఊరు బస్సుకి యేలైంది గానె – నే పోతా ఉండానబ్బా..

sree-charitham_naa-railu-vellipoyindhi

కావాలని నేనెప్పుడూ ఏదీ చేయలేదు..

(అది చదువైనా, తిరుగుళ్లయినా, ఉద్యోగాలైనా)

కావాలనుకున్నదేదీ నాకు దక్కలేదు..

(ఇది ఇక్కడ ప్రస్తావించడం తగదేమో)

నన్ను కావాలనుకున్న వారికెవరికీ నేను అందుబాటులో లేను..

(ఉద్యోగరీత్యా పరాయి రాష్ట్రంలో అమ్మకు దూరంగా ఉండటం మాత్రమే కాకపోవచ్చు)

నేను కావాలనుకున్నవారెవరూ నా కనుచూపు మేరలో లేరు..

(ఇది గానీ చెప్పానంటే గొడవలైపోతాయంతే)

జరిగిపోయిన రణానికి కారణాలను, అయిపోయిన ఎన్నికలపై సమీక్షలను వ్రాయడం ఎంత టైమ్ వేస్టో తెలిసిందే అయినప్పటికీ అనుక్షణం నేనున్నానంటూ లోనుండి తన్నుకొచ్చే ఆ బాధతో కూడిన విచారం వల్ల కలిగిన దిగులు ఉంది చూశారూ.. దాన్ని ఆపడం బ్రహ్మదేవుడి వల్ల కూడా కాదు.
అవసరం కొద్దీ అన్ని పురాణాలను, వేదాలను, సామెతలను మనకనుగుణంగా వాడేసుకోవడం ; దాని మూలంగా ఏదైనా పొరపాటు సంభవించినప్పుడు, ఎవరైనా మనల్ని వేలెత్తి చూపినప్పుడు – నేరం నాది కాదు – అంటూ తప్పించేసుకోవడం అలవాటైపోయిన సగటు జీవినే కనుక నేనూ ఈ సందర్భంగా నాకు తోచిన ఓ వాక్యాన్ని మీతో పంచుకుంటున్నానన్నమాట.

కష్టాలను పంచుకుంటే తరిగిపోతాయి, సుఖాలను పంచుకుంటే రెట్టింపు అయిపోతాయి.

నాలుగేళ్ల క్రితం నేనూహించిన, నేను తెద్దామనుకున్న విప్లవం, నేను ఎంతగానో ప్రయత్నించి భంగపడిన ఓ మహా కార్యం ఈ మధ్యే మా ప్రజా మండలిలో విజయవంతంగా చోటు చేసుకుంది.  ఏ మాటైతే మా సభ్యుల నోట వెంట వస్తుందని అహర్నిశలూ శ్రమించానో, ఏ ఒక్క చిన్న అనుమతి కోసం నిరంతరం తపించానో, ఉపవాసాలు, మౌనవ్రతాలు, జాగరణలు, బహిష్కరణలు లాంటి విభిన్న దీక్షలకు పూనుకున్నానో, అది అలాంటి మార్పు ఇప్పుడు జరిగింది.

కానీ,

నేనెక్కవలసిన రైలు ఎప్పుడో వెళ్లిపోయింది..!

sreecharitham_aasa-nirasena

ఏంటో బంగారు లోకం కాస్తా బరువుగా మారిపోయింది..

ఊహల పల్లకీని మోయలేక మధ్యలోనే మంగళం చెప్పవలసి వచ్చింది..

ఇతమిద్ధంగా ఇది అని చెప్పలేని బాధ గుండెలను పిండేస్తోంది..

ఇక ఇంతేనా అనే నిరాశ పెనుభూతమై కమ్ముకుంటోంది..

ఉడిగిపోతున్న శక్తిని కూడగట్టుకుని కారణాల కోసం అన్వేషిస్తే..

ఆ ఒకే ఒక్క కారణం తెలిసిపోయింది..

అదేంటో కాదు -

బయోడేటాలతో పాటు మా ఇంటికి విచ్చేసిన పెళ్లికూతుళ్ల ఫోటోలే.

పాత టపాలు »